పొడి చర్మంతో పోరాడే వింటర్ స్కిన్ కేర్ టిప్స్

చలికాలంలో చర్మం బాగా పొడిబారిపోతుంది. పెద్దవయసు వారిలో, పిల్లల్లో, మధ్య వయస్కులు సమస్య వుంటుంది. ఎందుకంటే చర్మంలో నూనె లేకపోవడం. వృద్ధుల్లో ఈ సమస్య తీవ్రత అధికం. ఫ్లెకి స్కిన్‌... చర్మం బాగా ఎండి చేప చర్మంలా కనిపిస్తుంది. బయటికి కనిపించే భాగాల్లో (ముఖం, చేతులు, పాదాలు, మెడ) చర్మం శీతాకాలంలో ఎండిపోతుంది. వాతావరణంలో మార్పు వల్ల ఇలా జరుగుతుంది.

చర్మంలోని నూనె బయటికి వెళ్లిపోవడం (సెక్రియేషన్‌ తగ్గుతుంది). వాతావరణంలోని మార్పుల వల్ల ఉష్ణోగ్రత తేమను లాగేసుకోవడం వల్ల చర్మం ఎండిపోతుంది. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు శీతాకాలంలో చర్మ సమస్యలు బారిన పడతారు. ఆరోగ్యంగా ఉన్న వారికి మామూలుగా చర్మం ఎండిపోతుంది. చర్మ వ్యాధులు, చేప పొట్టులాంటి చర్మం వున్న వారికి మరింత తీవ్రంగా చర్మం ఎండిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలోని నూనె శాతం తగ్గుతుంది. దీనికి ఉష్ణోగ్రత తోడవుతుంది. మధుమేహం ఉన్న వారికి చర్మం ఎండిపోవడం సాధారణం. థైరాయిడ్‌ సమస్య ఉన్న వారికి చర్మం బాగా ఎండుతుంది.

లక్షణాలు :

చర్మం ఎండిపోవడం, తీవ్ర దురద. వేసుకునే బట్టలకు ఎండిన చర్మానికి ఘర్షణ జరిగి దురదపెడుతుంది. దీన్ని చర్మ సమస్యగా ఆందోళనచెందుతారు. కానీ శీతాకాలంలో వచ్చే మార్పు ఇది.

పెద్ద వారిలో :

మధుమేహం, థైరాయిడ్‌, అధిక రక్తపోటు, గుండెజబ్బులుంటే చర్మ సమస్యలు మరింత అధికమవుతాయి. స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, దురద వల్ల పుళ్లు (అల్సర్‌) ఏర్పడతాయి. థైరాయిడ్‌, మధుమేహం వ్యాధుల్లో హార్మన్ల అసమతుల్యం వల్ల చర్మం ఎండిపోవడమే కాక, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలోని నూనె ఉత్పత్తి తగ్గుతుంది.

పిల్లల్లో :

పిల్లల్లో తీవ్ర సమస్యలుండవు. కానీ చర్మం ఎండిపోతుంది. ఊపిరిత్తుల అలర్జీ ఎలా వుంటుందో, చర్మానికి కూడా అలర్జీ లాంటిదే దీన్ని ఎటొపిక్‌ డెర్మయిటిస్‌. చర్మం ఎండిపోవడంతోపాటు ఎటొపిక్‌ డెర్మయిటిస్‌ వుంటే ఈ సమయంలో పరిస్థితి తీవ్రంగా వుంటుంది. తీవ్ర దురద, గోళ్లతో గాటుపడేటట్లు గోకడం వల్ల చర్మం ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. అలర్జీ, గజ్జి పెరుగుతుంది. తీవ్ర చర్మ సమస్యలు అధికమవుతాయి. జన్యుపరంగా పుట్టకతో చేప పొట్టులాంటి చర్మం వుంటుంది. ఇలాంటి వారికి చర్మం ఇంకా బాగా ఎండిపోతుంది.

మహిళల్లో :

అన్ని వయసు వారికి సమస్య ఒకేలా వుంటుంది. థైరాయిడ్‌, మధుమేహం వుంటే మధ్య వయసులో ఉన్నవారికి, హార్మోన్‌ చికిత్స, గైనిక్‌ సమస్య వుంటే చర్మం బాగా ఎండిపోతుంది. యుక్తవయసులో చర్మ గ్రంథులు ఎక్కుగా యాక్టివ్‌ వుంటాయి. మధ్య వయసులో, వృద్ధుల్లో సమస్య ఎక్కువ.

జాగ్రత్తలు :

ఏడాది వయసు లోపు పిల్లలకు సమస్య తీవ్రంగా వుండదు. మాయిశ్చరైజర్‌ సబ్బు, మాయిశ్చరైజర్లు క్రీము వాడాలి. పెద్ద వారికన్నా పిల్లల చర్మంపై క్రీము రాస్తే వెంటనే రక్తంలో కలిసిపోతుంది. అందుకే క్రీమును ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.
యాంటిసెప్టిక్‌ సబ్బులు, లోషన్లు వల్ల ఇన్‌ఫెక్షన్స్‌ పెరుగుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. చర్మంపై గుడ్‌ ఆర్గనిజమ్స్‌, బ్యాడ్‌ ఆర్గనిజమ్స్‌ వుంటాయి. యాంటిసెప్టిక్‌ సబ్బులు, లోషన్‌ వాడడం వల్ల గుడ్‌ ఆర్గనిజమ్స్‌ చనిపోతాయి. బ్యాడ్‌ ఆర్గనిజమ్స్‌ పెరిగి ఇన్‌ఫెక్షన్లు అధికమవుతాయి. లోషన్లు వాడినప్పుడు రక్తంలో వెంటనే కలిసిపోయి ఇతర దుష్ఫ్రభావం కలుగుతాయి.

మాయిశ్చరైజింగ్‌ సబ్బులు వాడాలి

స్నానం చేసిన తర్వాత టవల్‌తో గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా తుడవాలి. నీటి చెమ్మ ఉన్నప్పుడు మాయిశ్చరైజింగ్‌ క్రీము వాడాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై ఉన్న నీరు ఆవిరికాకుండా క్రీము నిలుపుతుంది. దీంతో చర్మం తేమగా వుంటుంది. స్నానం చేసిన రెండు నుంచి ఐదు నిమిషాల్లో మాయిశ్చరైజింగ్‌ క్రీము పెట్టాలి. పొడి చర్మంపై క్రీము పెడితే వృధా అవుతుంది. పొడి చర్మం, అలర్జిక్‌ స్కిన్‌, ఎటోపిక్‌ డెర్మయిటిస్‌, చేప పొట్టులాంటి చర్మం ఉన్న పిల్లలకు స్నానానికి గంట ముందు లిక్విడ్‌ పారఫిన్‌ ఆయిల్‌ను పట్టించాలి. దీంతో ఎండిన చర్మాన్ని కొద్దిగా మృదువుగా అవుతుంది. స్నానం అయ్యాక మాయిశ్చరైజింగ్‌ను పెట్టాలి. శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు బేసిన్‌ పిండి, సున్ని పిండి ఒంటికి రాసుకుంటారు. చర్మ సమస్యలున్న వారికి ఇవి వాడకూడదు. ఎందుకంటే ఈ పిండిలోని ప్రోటీన్లు సమస్యను మరింత తీవ్రమయ్యేట్లు చేస్తాయి. పసుపు కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇందులో చాలా రకాల రంగులు కలుపుతున్నారు.

Comments