రోజు తులసి ఆకులు తింటే..?

ముఖ సౌందర్యం, వర్చస్సు ఎక్కువగా, శరీర ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఆరోగ్యం బాగానే ఉన్నా, వాతావరణ కాలుష్యాల వల్ల కూడా కొందరి ముఖం మీద కొన్ని మచ్చలు, మరకలూ ఏర్పడవచ్చు. వీటిని నివారించడంలో తులసి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోకి తీసుకునే తులసి రసం, రక్తశుద్ధికి దివ్యంగా పనిచేస్తుంది. అలాగే, ముఖం మీద లే పనంగా వాడితే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. బ్యాక్టీరియాను నశింపచేసే లక్షణం ఉన్నందున,ఆరోగ్య పరిరక్షణలో అనాదిగా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం వేళ కాసేపు తులసి ముందు కూర్చుని ఆ వాసనను బలంగా పీలిస్తేనే రక్తశుద్ధి అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాంటిది కడుపులోకి నేరుగా ఆ రసాన్ని, లేదా ఆకు ముద్దను తీసుకుంటే ఇక చెప్పేదేముంది!

ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం సౌందర్యవంతంగానూ, కాంతివంతంగానూ మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది. రోజూ కొన్ని తులసి ఆకుల్ని, నమలి తినేస్తే, రక్త శుద్ధి ఏర్పడుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి గానీ, ఒక పేస్ట్‌లా ముఖానికి పట్టిస్తే, అక్కడున్న గుంటల్లో నిలిచిపోయిన అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి వర్చస్సు పెరగడంతో పాటు ముఖం, సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.

Comments