అరటిపండుతో ఆకట్టుకునే చర్మసౌందర్యం

సీజన్ ని బట్టి రకరకాల పండ్లు మార్కెట్ లో లభిస్తున్నాయి. అయితే.. అన్ని కాలాలు.. అన్ని వర్గాల వారికి అందుబాటులో.. తక్కువ ధరలో దొరికేది అరటిపండు. ఇది ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎన్నో పోషకవిలువలున్న అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించవచ్చు. అందరికీ అందుబాటులో ఉండే.. అరటిపండు.. మీ చర్మ రక్షణకు తోడ్పడుతుంది. బనానాతో.. మెరిసే చర్మం పొందడానికి ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లు మీకోసం..

అవకాడో, బనానా ప్యాక్

అరటిపండుతోపాటు, అవకాడో కూడా చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. అవకాడో, అరటిపండు రెండింటి గుజ్జును సమపాళ్లలో తీసుకుని.. మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ తరచుగా వేసుకుంటుంటే.. మీ చర్మ కాంతి పెరుగుతుంది.

అరటిపండు ప్యాక్

ముఖాన్ని కడిగి, పొడి బట్టతో తుడుచుకుని.. బాగా పండిన అరటిపండు గుజ్జుని మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖం పై రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మం మృదువుగా తయారవుతుంది.

బనానా, తేనె

సగం అరటిపండుకు.. ఒక టేబుట్ స్పూన్ తేనె కలిపి.. మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకి పట్టించి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ని ప్రయత్నించి చూడండి.. మీ ముఖ వర్చస్సు రెట్టింపవుతుంది.

మొటిమలకు చెక్ పెట్టే బనానా ప్యాక్

అరటిపండు గుజ్జుకి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత.. చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే.. మొటిమలు, మచ్చలు మాయమౌతాయి.

పొడిచర్మానికి అరటిపండు ప్యాక్

అరకప్పు అరటిపండు గుజ్జు, అరకప్పు ఓట్ మీల్, ఒక స్పూన్ చక్కెర,గుడ్డులోని పచ్చ సొన.. ఈ నాలుగింటిన బాగా కలిపి మిశ్రమంగా తయారు చేసుకుని.. ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉండే.. పొడిచర్మానికి గుడ్ బై చెప్పవచ్చు.

జిడ్డు చర్మానికి

జిడ్డు చర్మం ఉన్న వాళ్లు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఫలితం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటివాళ్లు అరకప్పు అరటిపండు గుజ్జు, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పెరుగు కలిపి ప్యాక్ వేసుకుంటే.. ఫలితం ఉంటుంది.

ముఖంపై ముడతలకి

చర్మంపై ముడతలు ఏర్పడ్డాయంటే.. చర్మం కాంతి విహీనంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు.. అరకప్పు అరటిపండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని పచ్చసొన తీసుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Comments