ముఖానికి ఇంట్లో తయారు చేసుకొనే క్లెన్సింగ్ ప్యాక్...

కాలుష్య ప్రభావం, సూర్య రశ్మి, వల్ల ముఖం మీద పడే దుమ్ము, ధూళి జిడ్డు పోవాలంటే ఇంట్లోనే తయారచేసుకున్న క్రీములను వాడుకోవచ్చు. రాత్రి పడుకునేముందు ఈ క్రీములలో ఏదైనా ఒకటి ముఖానికి రాసుకుని పదినిమిషాలు ఉండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇది సున్నితంగా చర్మాన్ని శుభ్రపరచి స్వచ్ఛంగా, అందంగా ఉండేలా చేస్తుంది. క్లెన్సింగ్ ప్రభావంతంగా పనిచేసి అన్ని రకాల కాలుష్యాలను తొలగిస్తుంది. చర్మానికి ఎటువంటి నష్టం కలగనీయకుండా అన్నిరకాల చర్మతత్వాలకూ ఉపకరిస్తుంది.

చర్మం పై పేరుకున్న దుమ్ము ధూళి తొలగిపోయి పరిశుభ్రంగా ఉండటమే కాదు, ప్రత్యేక మెరుపు సంతరించుకోవాలంటే క్లెన్సింగ్ బాగా ఉపయోగపడుతుంది. క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి, శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది. కాబట్టి చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు, కాంతివంతంగా చేసేందుకు క్లెన్సింగ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం....

 1. పుదీనా మాస్క్:

 కొద్దిగా పుదీనా ఆకులు, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ తో పుదీనా మాస్క్ వేసుకోవాలి. పుదీనా ఆకులను కడిగి పొడిచేసుకోవలెను. రోజ్‌ వాటర్‌తో కలిపి పేస్టుగా చేసుకొని దీనిని ముఖానికి అప్లై చేసి ఒక గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

2. బొప్పాయి పండు మాస్క్: 

బొప్పాయి ముక్కలను బాగా చిదిమి గుజ్జులా చేసి అది ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి కాంతి వస్తుంది.

 3. టమోటా మాస్క్: 

ఇది జిడ్డు చర్మమానికి బాగా పనిచేస్తుంది. బాగా పండిన ఒక టమోట, నిమ్మతొక్క పొడి, ఒక టీస్పూన్ నిమ్మరసంతో టమోటా మాస్క్ తయారు చేసుకోవచ్చు. టమోట గుజ్జు తయారుచేసి దానిలో నిమ్మతొక్క పొడి మరియు నిమ్మరసం కలిపి. ముఖమునకు పూసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

 4. హెర్బల్‌ క్లీన్సింగ్‌ క్రీము: 

2 చెంచాలు మంచి కొబ్బరి నూనె, 5 చెంచాలు ఆలివ్‌ ఆయిల్, 2 చెంచాలు గ్లిజరిన్‌, 4 చెంచాలు తేనె మైనం, 5 చెంచాలు దోసకాయ రసం, చిటికెడు బోరెక్స్: మైనం కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిలు, 2 సార్లు వేడి చేసుకోవాలి. దోసకాయ రసం, గ్లిజరిన్‌, బోరెక్సు, విడివిడి పాత్రలలో వేడి చెయ్యాలి. బోరెక్సును మాత్రం పూర్తిగా కరిగేవరకు వేడిచెయ్యాలి. ఈ మూడింటిని ఆయిల్‌ మిశ్రమంలో బాగా కుంచుతో గట్టిపడేవరకు కలియబెట్టాలి. చల్లారిన తర్వాత ఉపయోగించుకొనవచ్చును. ఫ్రిజ్‌లో దాచుకోవచ్చును.

5. గోధుమరవ్వ మాస్కు: 

1 చెంచా గోధుమరవ్వ, 1/2 చెంచా ఓట్‌మీల్‌, 1 చెంచా ఆలివ్‌ అయిల్‌, 1 చెంచా ఫ్రెష్‌ క్రీము(మీగడ), ముందు గోధుమరవ్వ మరియు ఓట్‌మీల్‌ కలిపి ఈ మిశ్రమమును ఆలివ్‌ ఆయిల్‌, క్రీము కలిపి, పేస్టుగా తయారుచెయ్యాలి. ఈ మిశ్రమాన్నిముఖానికి రాసుకున్నఅరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Comments