సౌందర్యంలో మట్టి చేసే గమ్మత్తులు...

సాధారణంగా మట్టిని రకరకాల సౌందర్య చికిత్సల్లో వాడటం కొందరికి మాత్రమే తెలుసు. ముల్తానీ మట్టి అనేది కొత్తదేమీ కాదు. పాత సౌందర్యసాధనమే. సహజమైన ఫేస్‌ ప్యాక్‌ కావటం వల్ల ముల్తానీ మట్టి చేసే గమ్మత్తులు చాలా వున్నాయి. దీనివల్ల చర్మం నునుపు తేలి, మృదువుగా మారుతుంది. చర్మంపై మచ్చల్లాంటివి తగ్గి.. మంచి రంగు రావాలంటే.. ఈ క్లేలకు అదనంగా మరికొన్ని పదార్థాలు కలిపి చికిత్స తీసుకోవాలి. దీనివల్ల జిడ్డు సమస్య అదుపులో ఉంటుంది. ముడతలు మాయమవుతాయి.

నెలలో ఎన్నిసార్లు వేసుకోవాలనేది వయసును బట్టి ఉంటుంది. పదిహేనేళ్లలోపు అమ్మాయిలు అస్సలు వాడకూడదు. మరీ తప్పనిసరైతే నెలకోసారి ప్రయత్నించాలి. ఇరవైఅయిదేళ్లు దాటినవాళ్లు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోవాలి. ముప్ఫై అయిదేళ్లు దాటిన స్త్రీలు నెలకు నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు. యాభై పైబడినవాళ్లు ఇలాంటి ప్యాక్‌లు వేసుకోకపోవడమే మంచిది. మొటిమలు ఉన్నచోట ఈ ప్యాక్‌ వేయకూడదు. కళ్ల అడుగున, కనురెప్పల పైన కూడా రాయకూడదు. చర్మం బిగుతుగా మారుతుంది. ఇలాంటి ప్యాక్‌లు వేసుకున్న తరవాత పదిహేను నిమిషాలకు కచ్చితంగా తొలగించాలి. ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు నవ్వటం, మాట్లాడటం లాంటి కదలికలు ముఖంలో ఉండకూడదు.

ప్యాక్‌ లు: 

పూతకోసం వాడే మట్టి ముల్తానీ, చైనా క్లే, వండర్‌ మట్టి, గ్రీన్‌ క్లే, బ్లాక్‌ క్లే.. వంటి రకాల్లో దొరుకుతుంది. చర్మతత్వాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది.

 మృదువైన చర్మానికి:

 చర్మాన్ని మృదువుగానూ, కాంతివంతంగానూ చేసుకునేందుకు ముల్తానీ మట్టిని వాడుకోవచ్చు. 2 చిన్న చెంచాల ముల్తానీ మట్టికి అంతే కొబ్బరి నీరు, ఖీరాల రసం, 1/4 చిన్న చెంచాడు చందనం పొడి కలిపి లేపనం చేసుకోవాలి. ముఖానికి రాసుకుని, పావు గంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. వారంలో ఒకసారి ఇలా చేస్తే, చర్మం శుభ్రపడి, సుందరమూ, ఆకర్షకమూ అవుతుంది.

 నల్లదనం పోయేందుకు:

 ముఖచర్మం రంగు తేలేందుకు కూడా ముల్తానీ మట్టి పని చేస్తుంది. 2 పెద్ద చెంచాల ముల్తానీ మట్టిలో అంతే పన్నీరు, 1/4 చిన్న చెంచా గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 10 నిముషాలు వుంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఈ ప్యాక్‌ను వాడుకుంటే, నల్లని చర్మంలో చాలా వరకూ మార్పు కలుగుతుంది.

 ముడతలకు:

 నాలుగైదు బాదాములను రుబ్బి, ఆ ముద్దకు 4 చిన్న చెంచాలు ఖీరాల రసం, 2 చిన్న చెంచాలు ముల్తానీ మట్టి చేర్చాలి. నెలలో నాలుగు మార్లు ఈ ప్యాక్‌ను వేసుకోవాలి. కొంత కాలానికి చర్మంలోని ముడతలు తగ్గుతాయి. సహజ చర్మతత్వం ఉన్నవాళ్లు: ముల్తానీమట్టి అరచెంచా, పాలమీగడ లేదా పాలు అరచెంచా, గులాబీ రేకలపొడి అరచెంచా, తేనె చెంచా తీసుకుని పాలు లేదా సోయా పాలతో కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పది నిమిషాలయ్యాక తీసేయాలి.

 చర్మరంధ్రాల శుభ్రతకు:

 2 చిన్న చెంచాల ముల్తానీ మట్టిలో 4 చిన్న చెంచాల టొమాటో రసం కలిపి, ముఖానికి ప్రతి రోజూ రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. ఈ మిశ్రమాన్ని చేతులూ, ఇతరశరీరభాగాలకూ రాసుకోవచ్చు.

జిడ్డు చర్మానికి: 

చెంచా ముల్తానీమట్టి, పావుచెంచా నిమ్మరసం, అరచెంచా తేనె, పావుచెంచా పుదీనా పొడి చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు ఉంటుంది. చైనా క్లే ఒకటిన్నర చెంచా, గ్రీన్‌ టీ డికాక్షన్‌ చెంచా, కమలాఫలం తొక్కల పొడి, తేనె అరచెంచా చొప్పున తీసుకుని వీటన్నింటినీ రోజ్‌వాటర్‌తో మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. పది, పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మరీ జిడ్డుగా ఉంటే.. ఐదు రోజులకోసారి వేసుకోవచ్చు. జిడ్డు తక్కువగా ఉంటే.. నెలకు మూడుసార్లు రాసుకోవచ్చు. చర్మంలో మొటిమలు, జిడ్డు తగ్గడమే కాదు.. అందంగానూ మారుతుంది.


Comments