కోమలమైన చర్మానికి బేబీ ఆయిల్

అందమైన చర్మం.. ఆకట్టుకునే వర్ఛస్సు కోసం అతివల ఆరాటం అంతా ఇంతా కాదు. చూడచక్కని అందం సొంతం చేసుకోవాలంటే.. ముఖంపైనే కాదు.. చేతులు, కాళ్లు, వంటి అన్ని భాగాలపైనా శ్రద్ధ వహించాలి. అప్పుడే అందరూ కోరుకునే.. అందరినీ ఆకర్షించే అందం సొంతం చేసుకోవచ్చు.

 మీ బ్యూటీ బాస్కెట్ లో బేబీ ఆయిల్ ని చేర్చుకున్నారా ? బేబీ ఆయిల్ ఎందుకని ఆలోచిస్తున్నారా ? నిజమే చర్మ సౌందర్యానికి బేబీ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చిన్నారుల చర్మ సంరక్షణకే కాదు.. పెద్దల సౌందర్యానికి కూడా బాగా పనిచేస్తుంది.

బేబీ ఆయిల్ లో గాఢత తక్కువగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగానూ మార్చేస్తుంది. అంతేకాదు.. దీని సువాసన కూడా అద్భుతంగా ఉంటుంది. చర్మం, సున్నితంగా.. కోమలంగా ఉండటానికి బేబీ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఇంతకీ బేబీ ఆయిల్ లో దాగున్న సౌందర్య చిట్కాలేంటో చూద్దామా...

చర్మ సౌందర్యానికి 

బేబీ ఆయిల్ ని నిత్యం ముఖానికి, కాళ్లు, చేతులకు అప్లై చేస్తూ ఉండాలి. ఇది శరీరానికి కావాల్సిన తేమను అందిస్తుంది. అంతేకాదు.. సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా కూడా బేబీ ఆయిల్ ఉపయోగపడుతుంది.

అదిరే అధరాలకు

 ఒక స్పూన్ బేబీ ఆయిల్, అర స్పూన్ చక్కెర, కొద్దిగా నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి.. మసాజ్ చేయాలి. ఇలా రోజూ రాత్రి పడుకోబోయే ముందు చేస్తూ ఉండాలి. దీనివల్ల మృదువైన, గులాబీ రంగు పెదాలు మీ సొంతమవుతాయి.

పగుళ్లకు 

చలికాలం వచ్చిందంటే చాలు. కాళ్ల పగుళ్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అలాంటప్పుడు బేబీ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ రాత్రి పడుకోబోయే ముందు పగుళ్లకు బేబీ ఆయిల్ తో మసాజ్ చేసుకుని సాక్సులు వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే.. పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు.

గోళ్లకు

 అప్పుడప్పుడు గోళ్లకు బేబీ ఆయిల్ రాసుకోవడం వల్ల మృదువుగా, ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మారతాయి.

గర్భిణీలకు 

గర్భిణీలకు పొట్టమీద చర్మం సాగడం వల్ల దురద ఏర్పడుతూ ఉంటుంది. దాంతో పాటు స్ర్టెచ్ మార్క్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి 7 నుంచి 9 నెలల మధ్యలో పొట్ట భాగాన్ని బేబీ ఆయిల్ తో మర్దనా చేస్తూ ఉండాలి. దీనివల్ల దురద తగ్గడమే కాకుండా.. స్ర్టెచ్ మార్క్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

మేకప్

 మేకప్ వేసుకునేటప్పుడు బేబీ ఆయిల్ ని ఫౌండేషన్ తో కలిపి ఉపయోగిస్తే ముఖం మరింత కాంతివంతంగా.. ఫ్రెష్ గా కనిపిస్తుంది. చలికాలంలో మాయిశ్చరైజర్ కు కాస్త బేబీ ఆయిల్ జోడించి రాసుకుంటే.. చర్మం పొడిబారకుండా ఉంటుంది.







Comments