పట్టులాంటి సాప్ట్ అండ్ షైనీ జుట్టు పొందడానికి హోం రెమెడీస్

అందమైన జుట్టు సొంతం కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరిలో పోషకాల లేమి, మరికొందరికి వాతావరణం, దుమ్ము, ధూళి వంటి కారణాలు ఏవైతేనే జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా మారుతుంది.
ఇలాంటప్పుడు రకరకాల సౌందర్యోత్పత్తులు ప్రయత్నిస్తుంటారు. దానికి బదులు ఇంట్లోనే దొరికే రసాయనాల ప్రభావం లేకుండా సహజంగా ఇంట్లోనే వీటికి పరిష్కారం లభిస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి జుట్టు రాలి, జుట్టును పట్టుకుచ్చలా పెరగడానికి ఎలాంటి చిట్కాలు సహాయపడుతాయో తెలుసుకుందాం..

శిరోజాల శుభ్రతకు ఉల్లిపాయ 

పరిశుభ్రత లేకపోతే సహజంగానే అనేక సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ముందుగా శిరోజాల్ని శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఉల్లిపాయ ముక్కలు వేసి మరిగించిన నూనెను తలకు పట్టించి మర్దన చేయాలి. అరగంట తరవాత గంజిని తలకు పట్టించి ఆరేవరకూ ఉంచాలి. ఆరాక మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సమర్థంగా జరిగి ఒత్తైన శిరోజాలు సొంతమవుతాయి.

చిట్లిన జుట్టుకి మెంతులు

 సూర్యకిరణాలు నేరుగా తాకే ప్రాంతం తల. అతినీలలోహిత కిరణాల ప్రభావం, అధిక వేడి వల్ల జుట్టు చిట్లిపోవడం, రంగు మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి నివారణగా రాత్రి నానబెట్టిన మెంతుల్ని మెత్తగా చేసుకొని దానిలో రెండు చెంచాల చొప్పున మందారపొడి, పుల్లని పెరుగు, చెంచా ఆముదం కలిపి తలకు పట్టించాలి. గంట తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు కొత్త కాంతిని సంతరించుకోవడతో పాటూ ఎదుగుదల కూడా బాగుంటుంది.

నిర్జీవమైన జుట్టుకు అలోవెర 

దుమ్ముధూళి, కాలుష్య ప్రభావంతో కొన్నిసార్లు జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఆరు మందార ఆకులు, రెండు చెంచాల కలబంద గుజ్జుని మెత్తగా చేసుకొని తలకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా తయారవడమే కాకుండా నిగనిగలాడుతుంది.


నిత్యం ప్రయాణాలు చేసేవారు వారానికోసారి కండిషనర్‌

 నిత్యం ప్రయాణాలు చేసేవారు వారానికోసారి కండిషనర్‌ను ఉపయోగించడం మేలు. దీనికి టీ పొడి చక్కగా పని చేస్తుంది. టీ డికాక్షన్‌లో రెండు చుక్కల నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన, రెండు చుక్కల బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరవాత తలస్నానం చేస్తే సరి. ఇది తెల్లబడిన జుట్టుకి కూడా చక్కగా పని చేస్తుంది.

శిరోజాలకు తగిన తేమ అవసరం.

 శిరోజాలకు తగిన తేమ అవసరం. లేకపోతే వెంట్రుకలు బలహీనంగా తయారవుతాయి. రాగి రంగులోకి మారతాయి. ఇలాంటప్పుడు కొబ్బరి నూనెలో మందార పువ్వు రేకలు, తులసి, కరివేపాకు వేసి మరిగించాలి. దీన్ని వారానికోసారి తలకు పట్టించి అరగంట తరవాత మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు నిగారింపు సంతరించుకొంటుంది. పట్టు కుచ్చులా మారుతుంది.






Comments